దీర్ఘకాలిక COVID

దీర్ఘకాలిక COVID అంటే ఏమిటి?

COVID-19 కారణంగా అనారోగ్యానికి గురైన ఎవరికైనా, ఆ తర్వాత దీర్ఘకాలిక COVID రావచ్చు. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. అంటే, ఇది చాలాకాలంపాటు ఉంటుంది మరియు/లేదా సమయం గడిచేకొద్ది వస్తూ, పోతూ ఉండవచ్చు. దీనినే కొన్నిసార్లు "పోస్ట్-COVID", "పోస్ట్-COVID-19 పరిస్థితి (PCC)" లేదా "లాంగ్-హాల్ COVID" అని కూడా పిలుస్తారు.

దీర్ఘకాలిక COVID అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. U.S.లో లక్షలాదిమంది పెద్దలు, పిల్లలు దీని బారినపడ్డారు. దీని రోగలక్షణాలు తేలికపాటిగా లేదా తీవ్రంగా ఉంటుంది మరియు కనీసం మూడు నెలల వరకు ఉండవచ్చు. కొందరి విషయంలో, దీర్ఘకాలిక COVID వైకల్యానికి కూడా దారితీయగలదు.

దీర్ఘకాలిక COVID అనేది ఒక సరికొత్త సమస్య కావడం వల్ల దీని గురించి ఇప్పటికీ చాలా విషయాలు తెలియవు. COVID-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌ని 2019లో మొదటిసారిగా గుర్తించారు. దీనిమీద పరిశోధన కొనసాగే కొద్దీ మనకి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.

దీర్ఘకాలిక COVID రోగ లక్షణాలు

దీర్ఘకాలిక COVID రోగలక్షణాలనేవి COVID-19 ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు లేదా సంవత్సరాలపాటు ఉండవచ్చు. ఈ రోగలక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు మరియు వీటిని గుర్తించడం లేదా రోగ నిర్ధారణ చేయడం కష్టంగా కూడా ఉండవచ్చు

Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ప్రకారం, దీర్ఘకాలిక COVIDకి సంబంధించిన 200 రోగలక్షణాలు ఉనికిలో ఉన్నాయి. శారీరకంగా లేదా మానసికంగా శ్రమపడిన తర్వాత ఈ లక్షణాలు మరింత ఎక్కువ కావచ్చు. ఎక్కువగా ఈ రోగలక్షణాలు కనిపిస్తాయి:

  • రోజువారీ పనులు చేసుకోలేనంత అలసట
  • శారీరక లేదా మానసిక శ్రమ తర్వాత సాధారణంగా అనారోగ్యంగా అనిపించడం (ఈ పరిస్థితిని వర్ణించడం కష్టంగా ఉండవచ్చు)
  • ఆలోచించడానికి లేదా మనసుపెట్టడానికి ఇబ్బందిపడడం. దీనినే "బ్రెయిన్ ఫాగ్" అని కూడా పిలుస్తారు
  • జ్వరం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • దగ్గు
  • ఛాతి నొప్పి
  • గుండె వేగంగా కొట్టుకోవడం (హార్ట్ పాల్పిటేషన్స్)
  • వాసన మరియు/లేదా రుచిలో మార్పు
  • తలనొప్పులు
  • నిద్ర సమస్యలు
  • కంగారు లేదా కృంగుదల
  • నిలబడిప్పుడు తలతిరగడం
  • కీళ్లు లేదా కండరాల నొప్పి
  • సూదులు, పిన్నులు గుచ్చుతున్నట్లు అనిపించడం
  • కడుపు నొప్పి
  • అతిసారం
  • మలబద్ధకం
  • దద్దుర్లు
  • రుతుచక్రంలో మార్పులు

దీర్ఘకాలిక COVID ఎవరికి రావచ్చు?

ఇదివరకే COVID-19 వచ్చిన ఎవరికైనా, గతంలో వాళ్లకి COVID-19 వచ్చినప్పుడు రోగలక్షణాలేవీ కనిపించకపోయినా సరే, దీర్ఘకాలిక COVID రావచ్చు. ఒకటి కంటే ఎక్కువసార్లు COVID-19 వచ్చినవాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి దీర్ఘకాలిక COVID వచ్చే ప్రమాదం ఉంది.

జూన్ 2024లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, అక్టోబర్ 2023 నాటికి వాషింగ్టన్‌లో 6.4% మంది వయోజనులు దీర్ఘకాలిక COVIDతో బాధపడుతున్నారని, దాదాపు 117,000 మందిలో పనులు చేసుకునే విషయంలో గణనీయమైన పరిమితులు చోటుచేసుకున్నట్టు అంచనా. ఇప్పుడు మధ్య మరియు తూర్పు వాషింగ్టన్‌లో దీర్ఘకాలిక COVID శాతం అత్యధికంగా ఉన్నట్టు కూడా ఈ పరిశోధనలో తేలింది. వాషింగ్టన్‌లో దీర్ఘకాలిక COVIDతో ఉన్న వయోజనుల శాతాన్ని Household Pulse Survey (హౌస్‌హోల్డ్ పల్స్ సర్వే) క్రమం తప్పకుండా మూల్యాంకనం చేస్తోంది. 

CDC పేర్కొంటున్న ప్రకారం, ఇలాంటివారికి దీర్ఘకాలిక COVID వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది:

  • మహిళలు.
  • వయోవృద్ధులు.
  • బయటపడని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు.
  • హిస్పానిక్ మరియు లాటినో ప్రజలు.
  • COVID-19తో తీవ్ర అనారోగ్యానికి గురైనవాళ్లు లేదా ఆసుపత్రిలో చేరినవాళ్లు.
  • COVID-19 వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లు.

ఆరోగ్య అసమానతలతో బాధపడేవాళ్లు దీర్ఘకాలిక COVID కారణంగా ప్రతికూల ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వ్యవస్థాగత (మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసే), నివారించదగిన మరియు అన్యాయమైన కారణాలనుబట్టి ఒక సమూహంలోనివాళ్లు వేర్వేరు ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆరోగ్య అసమానత వస్తుంది.

Office of the Assistant Secretary of Health (OASH, ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ హెల్త్) ప్రకారం, ఆరోగ్య సంరక్షణ తక్కువగా అందుబాటులో ఉన్న లేదా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సంబంధించిన అపోహ (సిగ్గు లేదా అపరాధ భావన) అనుభవించే సమూహాలకు దీర్ఘకాలిక COVID నిర్ధారించే అవకాశం తక్కువగా ఉండవచ్చు.

దీర్ఘకాలిక COVID అసమానతలను OASH ఎలా పరిష్కరిస్తుందనే దాని గురించిన మరింత సమాచారాన్ని మీరు ఇక్కడ చదవవచ్చు. 
 

దీర్ఘకాలిక COVIDను నిరోధించడం

COVID-19 రాకుండా చూసుకోవడం ద్వారా దీర్ఘకాలిక COVIDని నివారించవచ్చు. COVID-19 వ్యాక్సిన్ల విషయంలో అప్-టూ-డేట్‌గా ఉంటేనే COVID-19 నుండి మీకు ఉత్తమ రక్షణ దొరకుతుంది.

వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లతో పోలిస్తే, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకి COVID-19 వచ్చినప్పటికీ అది దీర్ఘకాలిక COVIDగా మారే అవకాశాలు తక్కువ.

మాస్క్ ధరించడం, గాలి ప్రవాహం మరియు వడపోత మెరుగుపరచడం, సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం, ప్రజలు ఎక్కువగా తాకే ఉపరితలాలను తరచుగా శుభ్రపరచడం, భౌతిక దూరం పాటించడం మరియు పరీక్షలు చేయించుకోవడం లాంటివి COVID-19 ఇన్ఫెక్షన్ నివారించడం కోసం ఉపయోగపడే ఇతర సాధనాలు కాగలవు.

మీకు COVID-19 సోకితే, ఈ మార్గదర్శకాలు పాటించడం ద్వారా COVID-19 నుండి ఇతరులను రక్షించండి.

దీర్ఘకాలిక COVID నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి: వ్యాక్సిన్ వేయించుకోండి (ఇంగ్లీషు) (PDF)

COVID-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి తెలుసుకోండి

దీర్ఘకాలిక COVIDను నిర్ధారించడం

దీర్ఘకాలిక COVID రోగనిర్ధారణ కష్టం కావచ్చు. కొన్ని రోగలక్షణాలను అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు.  దీర్ఘకాలిక COVIDని నిర్ధారించే ల్యాబ్ పరీక్షలు లేదా ఇమేజింగ్ అధ్యయనాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. రోగికి దీర్ఘకాలిక COVID ఉన్నప్పటికీ, వారి పరీక్షా ఫలితాలు మామూలుగానే రావచ్చు. దీర్ఘకాలిక COVID రోగలక్షణాలు సైతం ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు లేదా సంకేతాలు లాగే ఉండవచ్చు.

కొంతమంది దీర్ఘకాలిక COVID లక్షణాలు ఉన్నాయని చెబుతున్నా, COVID-19 లక్షణాలైతే వాళ్లలో కనిపించడం లేదు. వాళ్లు COVID-19 కారణంగా మొదటిసారి జబ్బు పడినప్పుడు పరీక్షలు చేయించుకోలేదు. వాళ్లకి గతంలో COVID-19 వచ్చినట్లు నిర్ధారించడం కష్టం కాబట్టి రోగ నిర్ధారణ చేయడం కూడా కష్టంగా ఉంటోంది. మీరు మొదటిసారిగా జబ్బు పడినప్పుడు COVID-19 పరీక్ష చేయించుకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా అవసరమైతే, మీకు దీర్ఘకాలిక COVID ఉన్నట్టుగా రోగ నిర్ధారణ చేయడం సులభం అవుతుంది.

దీర్ఘకాలిక COVID కోసం హెల్త్‌కేర్ అపాయింట్మెంట్ చెక్‌లిస్ట్ (CDC) (ఇంగ్లీష్)

కొత్త మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు

దీర్ఘకాలిక COVID అనేది అనేక అవయవ వ్యవస్థల మీద ప్రభావం చూపగలదు. రోగుల్లో రోగనిర్ధారణ చేయగల ఒకటి లేదా ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అవి: ఆటోఇమ్యూన్ సమస్యలు మరియు మ్యాల్జిక్ ఎన్‌సెఫలోమైలెటిస్/క్రోనిక్ ఫాటిగ్ సిండ్రోమ్ (ME/CFS) (ఇంగ్లీష్ మాత్రమే).

అంటే, COVID-19 ఉన్నవాళ్లలో మధుమేహం లేదా గుండె జబ్బులు లాంటి కొత్త ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇప్పటికే మధుమేహం, గుండె జబ్బు లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, COVID-19 సోకిన తర్వాత అవి ఇంకా తీవ్రం కావచ్చు.

దీర్ఘకాలిక COVIDతో జీవించడం

దీర్ఘకాలిక COVIDను ఎలా నిర్ధారించాలి, ఎలా చికిత్స చేయాలనే దాని గురించి ఇప్పటికీ చాలా విషయాలు తెలియవు. దీర్ఘకాలిక COVID ఉండడం లేదా దీర్ఘకాలిక COVID ఉన్నవారికి మద్దతు అందించడం లాంటివి గందరగోళంగా అనిపించవచ్చు. దీర్ఘకాలిక COVID రోగలక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో రోగలక్షణాలను నియంత్రించవచ్చు, మరికొందరిలో అవి వైకల్యానికి కారణమవుతాయి.

ఈ విషయంలో మీరు ఒంటరివారు కాదని గుర్తుంచుకోండి. Centers for Disease Control and Prevention (CDC) ప్రకారం, దీర్ఘకాలిక COVID ఉన్న ప్రతి 4 మందిలో 1 వ్యక్తి వారి రోజువారీ పనులను చేసుకోలేకపోతున్నట్లు నివేదిస్తున్నారు. ఇలాంటివాళ్లు ఒక మద్దతు బృందంలో చేరడం ద్వారా వారి ఒంటరితనం భావనలు తగ్గించుకోవచ్చు.

మరింత తెలుసుకోండి:

సర్దుబాటుల కోసం అడగండి. సర్దుబాటు అంటే, ఎవరికోసమైనా లేదా దేనికోసమైనా చేసిన మార్పు అని అర్థం. రోగలక్షణాల కారణంగా, అనారోగ్యం రాక ముందు చేయగలిగిన పనులను ఇప్పుడు చేయడం కష్టంగా మారవచ్చు లేదా చేయడం సాధ్యం కాకపోవచ్చు. పని మరియు పాఠశాల కార్యకలాపాలు చేయడం కష్టం కావచ్చు. మీ రోగలక్షణాలకు తగ్గట్టుగా సముచితమైన సర్దుబాట్లు చేయడం యజమానుల, పాఠశాలల బాధ్యత కావచ్చు.

క్రింద పేర్కొన్న ‘దీర్ఘకాలిక COVID మరియు వైకల్యం హక్కులు’ చూడండి.

మరింత తెలుసుకోండి:

మీ శక్తిని సరైన విధంగా ఉపయోగించండి. ప్రత్యేకించి, మానసిక లేదా శారీరక శ్రమ తర్వాత తరచుగా అలసిపోయినట్లు అనిపించడం ఒక సాధారణ రోగలక్షణం. మీ శక్తిని ఆదా చేసుకుంటూ, రోజంతా తరచుగా విరామం తీసుకోవడం మరచిపోకండి.

దీర్ఘకాలిక COVID ఉన్నప్పుడు మీ శక్తిని సరైన విధంగా ఉపయోగించడానికి దోహదపడే "4 P'ల" గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి: 120-066 - దీర్ఘకాలిక-COVID "4 P'ల" పోస్టర్ - 8.5x11 - జూన్ 2023 (wa.gov) (ఇంగ్లీష్)

దీర్ఘకాలిక COVID మరియు వైకల్యం హక్కులు

దీర్ఘకాలిక COVID అనేది శారీరక మరియు మానసిక వైకల్యాలకు దారితీయవచ్చు. Americans with Disabilities Act (ADA, అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్) ప్రకారం, దీర్ఘకాలిక COVIDని కూడా ఒక వైకల్యంగానే పరిగణించవచ్చు. దీర్ఘకాలిక COVID వైకల్యం ఉన్నవాళ్లకు వాళ్లు ఎదుర్కొనే వివక్ష నుండి చట్టపరమైన రక్షణ ఉంటుంది. వ్యాపారాల, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల నుండి సముచితమైన సర్దుబాట్లు పొందడానికి వాళ్లు అర్హులు కావచ్చు.

ADA కింద వైకల్యంగా “దీర్ఘకాలిక COVID” గురించి మార్గదర్శకం (ఇంగ్లీష్ మాత్రమే)

దీర్ఘకాలిక COVID మరియు గర్భధారణ

గర్భవతులు లేదా ఇటీవల గర్భం ధరించిన వారు COVID-19 కారణంగా తీవ్రంగా జబ్బుపడే అవకాశం ఎక్కువగా ఉంది. COVID-19 వల్ల గర్భధారణ మీద, గర్భంలో పెరుగుతున్న శిశువు మీద ప్రభావం చూపగల సమస్యలు ఎదురుకావచ్చు. గర్భిణీలు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు COVID-19 వ్యాక్సిన్లు వేయించుకోవడం సురక్షితమైనది, అలా చేయాలని సిఫార్సు కూడా చేస్తున్నారు.

గర్భవతులకు దీర్ఘకాలిక COVID రావచ్చు. గర్భధారణ సమయంలో మరియు ఆతర్వాత, దీర్ఘకాలిక COVID వల్ల వచ్చే పరిణామాల గురించి ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.

దీర్ఘకాలిక COVID మరియు యువతరం

దీర్ఘకాలిక COVID కారణంగా యువతీయువకులు కూడా జబ్బుపడవచ్చు. తరచుగా అలసిపోయే లేదా దేనిపైనైనా మనసు పెట్టే విషయంలో ఇబ్బందిపడే యువతీయువకులు పాఠశాల మరియు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇబ్బందిపడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు వారి రోగలక్షణాల గురించి స్పష్టంగా వివరించలేకపోవచ్చు.

దీర్ఘకాలిక COVID ఉన్న పిల్లలకు ప్రత్యేక విద్య, రక్షణలు లేదా సంబంధిత సేవలు అందించే విషయంలో రెండు ఫెడరల్ చట్టాలు (ఇంగ్లీష్ మాత్రమే) ఉన్నాయి.

యువతీయువకులు COVID-19 వ్యాక్సిన్ వేయించుకోవడమనేది దీర్ఘకాలిక COVIDను నిరోధించడానికి అత్యంత ఉత్తమమైన మార్గం కాగలదు. COVID-19 వ్యాక్సిన్ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

కమ్యూనిటీ కోసం వనరులు

దీర్ఘకాలిక COVID ప్రాథమికాలు (CDC)
దీర్ఘకాలిక COVIDతో జీవించడం (CDC)
దీర్ఘకాలిక COVID నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి: వ్యాక్సిన్ వేయించుకోండి (PDF) (ఇంగ్లీష్)
పోస్ట్-COVID పునరావాసం (UW మెడిసిన్) (ఇంగ్లీష్)

ఫిజీషియన్లు మరియు ప్రజా ఆరోగ్యం కోసం వనరులు

భాగస్వాముల కోసం వనరులు